సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

  • పశ్చిమగోదావరి జిల్లా చించినాడలో దళిత భూముల్లోని మట్టిని తరలిస్తున్నారన్న చంద్రబాబు
  • వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపణ
  • పోలీసులు అధికార పార్టీ గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో వైసీపీ నేతలే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ప్రశ్నించిన దళితులపై దాడి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. 

చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తమ అనుచరుల ద్వారా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. 

అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీన దళితులు నిరసనకు దిగితే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని చెప్పారు. దాడిలో గాయపడిన వారికి వెంటనే వైద్యం చేయించకపోగా... వారిని కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. పోలీసులు వారిని పక్కనున్న పాలకొల్లు ఆసుపత్రికి తీసుకుపోకుండా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారని విమర్శించారు. బాధితుల నుంచి వాంగ్మూలం కూడా తీసుకోలేదని చెప్పారు. 

పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నది నుంచి 200 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలను నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.


More Telugu News