హైదరాబాద్‌లో చంద్రబాబుతో ఆనం భేటీ.. టీడీపీ నుంచి పోటీ ఖాయమేనా?

  • ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం
  • ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర విమర్శలు
  • 40 నిమిషాలపాటు చంద్రబాబుతో భేటీ
  • వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బరిలోకి?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగే అంశంపై చంద్రబాబుతో ఆనం చర్చించినట్టు సమాచారం. మరోవైపు, ఇటీవల ఆనం కుమార్తె కైవల్యారెడ్డి యువనేత నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఇద్దరూ టీడీపీ నుంచి బరిలోకి దిగాలని కోరుకుంటున్నా.. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కైవల్యారెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శాసన మండలి ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆనంపై వైసీపీ అధిష్ఠానం ఓటు వేసింది. అప్పటి నుంచి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన టీడీపీలో చేరుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గత రాత్రి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలు పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బరిలోకి దిగాలని ఆనం యోచిస్తున్నట్టు సమాచారం.



More Telugu News