ముఖ్యమంత్రి గారూ.. నీ పదవి నా భర్త ఇచ్చిన గిఫ్ట్: సిద్ధూ భార్య ఆసక్తికర వ్యాఖ్య

  • పంజాబ్ పగ్గాలు సిద్ధూ చేపట్టాలని కేజ్రీవాల్ కోరుకున్నారని వ్యాఖ్య
  • కానీ కాంగ్రెస్ ను మోసగించడం ఇష్టం లేక సిద్ధూ ఒప్పుకోలేదన్న నవజ్యోత్ కౌర్
  • భగవంత్, సిద్ధూ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కౌంటర్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తన భర్త ముఖ్యమంత్రి సీటును బహుమతిగా ఇచ్చారని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పగ్గాలు సిద్ధూ చేపట్టాలని అరవింద్ కేజ్రీవాల్ కోరుకున్నారని, కానీ తన పార్టీని మోసగించడం ఇష్టం లేక సిద్ధూ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. ఇటీవల భగవంత్ మాన్, సిద్ధూ మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో ఆమె పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సీఎం మాన్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధూ స్పందిస్తూ... ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిఘా వ్యవస్థగా మార్చిన వారు, రిమోట్ కంట్రోల్ కు పావుగా మారి రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో నవజ్యోత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు.

ముఖ్యమంత్రి గారు మీకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెడుతున్నానని, ఇప్పుడు మీరు కూర్చున్న సీఎం కుర్చీ మీ సోదరుడు సిద్ధూ మీకు బహుమతిగా ఇచ్చారని తెలుసుకోండి... పంజాబ్ పగ్గాలను సిద్ధూ చేపట్టాలని గతంలో కేజ్రీవాల్ కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు. పంజాబ్ పట్ల సిద్ధూకు ఉన్న అంకితభావాన్ని చూసి సిఎం పదవిని అప్పగించాలని భావించారన్నారు. అందుకు వివిధ ప్రయత్నాలు చేశారని, కానీ సిద్ధూ తాను ఉన్న కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడవాలని అనుకోలేదని, ఆ అవకాశం మీకు కల్పించారన్నారు. రాష్ట్రం కోసం ఆయన త్యాగాలు చేశారన్నారు.


More Telugu News