గట్టి గుండె కోసం ఈ మినరల్స్ సాయం

  • పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం అవసరం
  • సోడియం మోతాదు మించితే హాని
  • వీటితోపాటు ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ తో గుండెకు రక్షణ
మన శరీరంలో అన్నింటికంటే గుండెకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నేటి జీవనశైలి, ఆహారం కారణంగా ఎక్కువ రిస్క్ ఎదుర్కొంటున్న ప్రధాన అవయవం హృదయమే. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి లేదంటే మధుమేహం, రక్తపోటు సమస్యలతో గుండెకు హాని కలగడం గురించి తెలుసు. కానీ, కావాల్సిన పోషకాలు అందకపోయినా గుండె ఆరోగ్యం బలహీనపడుతుందన్నది కూడా నిజమే. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియంతో గుండెకు జరిగే మేలు కూడా ఉంది.

పొటాషియం
మన శరీరంలో ఎంతో కీలకమైన ప్రక్రియలు జరగడానికి పొటాషియం అవసరపడుతుంది. కండరాల పనితీరుకు, రక్తనాళాల విశ్రాంతికి, రక్తపోటు తగ్గేందుకు, గుండెకు రక్షణనిచ్చేందుకు సాయపడుతుంది. చిలగడ దుంప, బీన్స్ లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. పెద్దలు ఒక రోజులో 4.7 గ్రాముల పొటాషియం ప్రతి రోజూ తీసుకోవాలి.

క్యాల్షియం
క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలుసు. అలాగే, గుండెలో ఎలక్ట్రికల్ తరంగాలకు, గుండె పనితీరుకు కూడా అవసరమే. గుండె ప్రేరణ, సంకోచాలను క్యాల్షియం నియంత్రిస్తుంది. గుండె స్పందనలు అసహజంగా మారడం తెలిసిందే. అలాంటి వారికి క్యాల్షియం అవసరం. క్యాల్షియం గుండె కండరాల్లోని కణాలకు చేరిన తర్వాత అక్కడ విద్యుత్ శక్తిని నియంత్రిస్తుంది. గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడానికి ఈ విద్యుత్ శక్తి కీలకంగా పనిచేస్తుంది. పాలు, ఆకుపచ్చని కూరగాయలు, సోయా, బీన్స్ లో క్యాల్షియం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ రోజులో 1000, 1200 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవచ్చు.

మెగ్నీషియం
నరాల పనితీరుకు మెగ్నీషియం అవసరం. పొటాషియం మాదిరే రక్తనాళాల వ్యాకోచానికి సాయపడుతుంది. రక్తపోటును, రక్తంలో షుగర్ ను, కండరాల పనితీరును నియంత్రిస్తుంది. రోజులో 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవచ్చు. అవకాడో, డార్క్ చాక్లెట్, బాదం, వాల్ నట్, అరటి పండులో మెగ్నీషియం లభిస్తుంది.

సోడియం
సోడియం పరిమితికి మించి తీసుకుంటే గుండెకు హాని కలుగుతుంది. సోడియం కావాల్సినంత శరీరానికి అందాలి. ఇది రక్తపోటును తగ్గిస్తుందని పలు అధ్యయనాలు గుర్తించాయి. కాకపోతే మోతాదు మించి తీసుకోకూడదు. తక్కువ తీసుకున్నా మంచిదే. కానీ అసలు సోడియం అందకుండా చేస్తే రక్తపోటు పడిపోయి గుండెకు నష్టం కలుగుతుంది. అలాగే, అధికంగా తీసుకున్నా రక్తపోటు పెరిగి గుండెకు నష్టం కలుగుతుంది. రోజులో 1.5 గ్రాములు మించకుండా చూసుకోవడం మంచిది. వీటికితోడు ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెకు మేలు చేస్తాయి.


More Telugu News