ఆదిపురుష్ టీంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి

  • కొండపైన హీరోయిన్ ను హత్తుకుని ముద్దుపెట్టుకున్న దర్శకుడు
  • వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఓంరౌత్ తీరుపై మండిపడుతున్న హిందూ సంఘాలు
రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఇటీవల తిరుమలలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల కోసం తిరుమల వెళ్లిన సినిమా బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం బయటకు వచ్చిన హీరోయిన్ కృతి సనన్ ను దర్శకుడు ఓంరౌత్ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. దీనిపై వివాదం రేగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పనులేంటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కూడా మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్‌ చేశారు. సినిమా రంగంలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బైబై చెప్పడం సాధారణమే కావచ్చు కానీ తిరుమల వంటి పుణ్య క్షేత్రంలో ఇలా చేయడం సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ కు భక్తిశ్రద్ధలు ఎక్కువేనని, ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చని ఆయన టీమ్‌ చెబుతున్నారు. ఐతే తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు.


More Telugu News