వివేకా హత్య కేసు: సీబీఐ కౌంటర్ లో కీలక అంశాల ప్రస్తావన

  • వైఎస్ భాస్కర రెడ్డి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు
  • బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
  • ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్ లో అవినాశ్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు. అయితే ఈ నెల 5న దాఖలు చేసిన కౌంటర్ లో మాత్రం ఏ8గా ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర రెడ్డి, అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ తెలిపింది. కేసును పక్కదారి పట్టించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

ఈ కేసులో భాస్కర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. భాస్కర రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో కీలక అంశాలను వెల్లడించింది. ఇందులోనే అవినాశ్ రెడ్డిని ఏ8గా ప్రస్తావించింది. పై అంశాలను పేర్కొంది. అదే సమయంలో ఈ హత్య గురించి జగన్ కు ముందే తెలుసునని కూడా అందులో పేర్కొంది.

శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలో అవినాశ్ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని, ఉదయం గం.5.20కి ముందే అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేసు పెట్టవద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్, శివశంకర్ రెడ్డి చెప్పారని, సీబీఐకీ, కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది. వివేకా హత్య విషయం ముఖ్యమంత్రి జగన్ కు ఉదయం గం.6.15కు ముందే తెలుసునని సీబీఐ తెలిపింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్ కు ఈ విషయం తెలుసునని దర్యాఫ్తులో గుర్తించినట్లు పేర్కొంది. ఈ దశలో భాస్కర రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాఫ్తును ప్రభావితం చేస్తారని ప్రస్తావించింది.

భాస్కర రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ఉపయోగం ఉండదని, ఆయన పులివెందులలో ఉంటే చాలు సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. అప్పుడు కేసుకు నష్టం జరుగుతుందని తెలిపింది. దర్యాఫ్తుకు సహకరించినట్లు భాస్కర రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, ఆయనపై గతంలోను మూడు కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇందులో రెండు కేసులు వీగిపోగా, మరొకటి తప్పుడు కేసుగా కొట్టి వేసినట్లు పేర్కొంది.


More Telugu News