తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 ఆలౌట్

  • లండన్ లో టెస్టు ఫైనల్ సమరం
  • సిరాజ్ కు 4 వికెట్లు
  • షమీ 2, ఠాకూర్ 2 వికెట్లు తీసిన వైనం
  • రెండో రోజు ఆటలో భారత బౌలర్ల పైచేయి
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఆటలో తేలిపోయిన భారత బౌలర్లు రెండో రోజు మాత్రం ప్రభావం చూపించారు. ముఖ్యంగా, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆసీస్ లైనప్ ను కకావికలం చేశాడు. సిరాజ్ కు 4 వికెట్లు దక్కాయి. షమీ 2, శార్దూల్ ఠాకూర్ 2, జడేజా 1 వికెట్ తీశారు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో 163 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీనియర్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ తన ఫామ్ ను చాటుకుంటూ 121 పరుగులు చేయడం విశేషం. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ దూకుడుగా ఆడి 48 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. లంచ్ అనంతరం సిరాజ్ విజృంభించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

ఆ తర్వాత, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడు కనబరుస్తోంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15 బ్యాటింగ్), యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


More Telugu News