సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య.. ఛార్జిషీట్‌లో కీలక అంశాలు

  • ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి 970 పేజీల ఛార్జిషీట్
  • విద్యార్థులు, అధ్యాపకుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
  • సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ సహకారంతో ఆధారాలు సేకరించిన పోలీసులు
కేఎంసీ మెడికో ధరావత్ ప్రీతి (26) ఆత్మహత్య చేసుకున్న నెలల తర్వాత వరంగల్ పోలీసులు బుధవారం 970 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. సీనియర్ విద్యార్థి మొహమ్మద్ సైఫ్ (27) వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ మాట్లాడుతూ... తాము విద్యార్థులు, అధ్యాపకుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశామని, ఇందులో సైఫ్ ఆమెను వేధించినట్లుగా స్పష్టంగా వెల్లడైందని తెలిపారు.

ఫిబ్రవరి 22న ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానంలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రీతికి సైఫ్ వేధింపుల వివరాలను పేర్కొన్నారు. ఆమె కమ్యూనిటిని పేర్కొంటూ కూడా సైఫ్ వేధించినట్లుగా పేర్కొన్నారు. 

విచారణలో భాగంగా  70 మంది స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ సహకారంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. ప్రీతి, సైఫ్, ఇతర స్నేహితుల ఫోన్ డేటాను సేకరించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్య చేసుకున్నదని తేలినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లోను ప్రీతిని వేధిస్తూ సైఫ్ షేర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ అంశాన్ని ఫ్యాకల్టీ దృష్టికి కూడా ప్రీతి తీసుకు వెళ్లిందని తెలిపారు.


More Telugu News