ఆదిపురుష్ చిత్రానికి చెందిన ఆ పోస్టర్ ఫేక్... ఎవరూ నమ్మొద్దు: తిరుపతి పోలీసులు

  • ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్
  • తిరుపతిలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టర్
  • పోస్టర్ లో పేర్కొన్నది వాస్తవం కాదన్న తిరుపతి పోలీసులు
తిరుపతి నగరంలో ఆదిపురుష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడం తెలిసిందే. కాగా, ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, దానిపై తిరుపతి పోలీసులు స్పందించారు. ఆ పోస్టర్ ఫేక్ అని స్పష్టం చేశారు. 

"రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం... ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు... హిందువులందరం తప్పక వీక్షిద్దాం" అన్నదే ఆ పోస్టర్ సారాంశం. 

సోషల్ మీడియాలో ఈ పోస్టర్ విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ పోస్టర్ లోని అంశాలను ఆదిపురుష్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు తిరస్కరించాయని, ఇలాంటి వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ పోస్టర్ లో పేర్కొన్నది వాస్తవం కాదని స్పష్టం చేశారు.


More Telugu News