మనకు కూడా అమెరికా, యూకే మాదిరి రైలు వ్యవస్థ అవసరమా?

  • రైల్వే నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే సూచనలు
  • యూకే, అమెరికాలో ప్రైవేటు సంస్థల చేతుల్లోనే నిర్వహణ
  • అక్కడ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడడం ప్రస్తావన
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మరణించడం.. రైలు ప్రయాణ భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. గడిచిన పదేళ్లలో మన దేశంలో 10 పెద్ద రైలు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 600 మంది అసువులు బాశారు. అయితే, కేంద్రంలోని మోదీ సర్కారు రైలు ప్రమాదాల నివారణకు, ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్న మాట వాస్తవం. అయినా కానీ, ప్రమాదాలను పూర్తిగా నివారించలేని పరిస్థితులు ఉన్నాయన్నది కూడా నిజమేనని ఇటీవలి ప్రమాదంతో తెలుస్తోంది.

అమెరికా, బ్రిటన్ లో రైలు ప్రమాదాలు చాలా అరుదు. అక్కడ రైల్వే సదుపాయాలైన ట్రాక్ లు, స్టేషన్లు, రోలింగ్ స్టాక్ (ట్రెయిన్ సెట్, లోకో మోటివ్ లు, ప్యాసింజర్, ఫ్లయిట్ కార్లు)ను ప్రైవేటీకరించారు. ఏ ప్రమాదం జరిగినా బాధ్యత ప్రైవేటు కంపెనీలపైనే పెట్టారు. దీంతో అక్కడ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడినట్టు ఆయా దేశాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చాలా వరకు రైలు ట్రాక్ లు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. భద్రతా ఆడిట్ లను సెంట్రల్ ఏజెన్సీ నిర్వహిస్తుంటుంది. 

మన దేశంలోనూ రైల్వే నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల భద్రత, వసతులు మెరుగు పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిపుణులు, రైల్వే మాజీ ఉద్యోగులు ఈ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ మెయింటెనెన్స్, పాతబడిన సదుపాయాలను తీసివేసి కొత్తవి అమర్చడాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనే సూచనలు వస్తున్నాయి. 

‘‘నిర్వహణ కార్యకలాపాలను రైల్వే శాఖ నిర్వహించడం వల్ల అందులో జాప్యం నెలకొంటోంది. ఒక్కోసారి అధికారులు మారడం వల్ల మధ్యలోనే అవి ఆగిపోతాయి. నిధుల కొరత, ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ప్రైవేటు సంస్థలకు వర్క్ కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల వీటిని నివారించొచ్చు’’ అని ఓ రవాణా రంగ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని మెట్రో రైలు నెట్ వర్క్ లను నిపుణులు ఉదహరిస్తున్నారు. పెద్ద పట్టణాల్లో మెట్రో రైలు సర్వీసులను ప్రైవేటు సంస్థలే సమర్థవంతంగా నిర్వహిస్తుండడం గమనార్హం.


More Telugu News