మా అమ్మాయిని బ్రిజ్ భూషణ్ వేధించలేదు: రెజ్లర్ తండ్రి

  • తాము చేసిన ఆరోపణలు కొన్ని నిజం కావంటూ తాజా స్టేట్ మెంట్
  • తమ కుమార్తె పట్ల పక్షపాతంగా వ్యవహరించినట్టు వెల్లడి
  • ఆసియా ఛాంపియన్ షిప్ లో అవకాశం ఇవ్వకపోవడంతో ఆగ్రహించినట్టు వెల్లడి
రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు స్వల్ప ఉపశమనం దక్కింది. భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ మైనర్ బాలిక తండ్రి యూటర్న్ తీసుకున్నారు. సదరు బాలిక ఫిర్యాదు మేరకు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ పై తాను, తన కుమార్తె తప్పుడు ఆరోపణలు చేసినట్టు సదరు బాలిక తండ్రి తాజాగా ప్రకటించారు.

ఢిల్లీ మేజిస్ట్రేట్ వద్ద ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చారు. తన కుమార్తె పట్ల బ్రిజ్ భూషణ్ పక్షపాతం చూపించారే కానీ, లైంగిక వేధింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. గతేడాది ఆసియా ఛాంపియన్ షిప్ ట్రయల్స్ లో తన కుమార్తెకు అవకాశం రాకపోవడం వల్ల ఆగ్రహంతోనే ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కాకపోతే ముందు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదు. బదులుగా తాజా స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. తనకు వేధింపులు వస్తున్నాయంటూ, వారి పేర్లను వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఎవరి ప్రభావం లేకుండా తానే స్వచ్ఛందంగా ఈ స్టేట్ మెంట్ ఇస్తున్నానని ఆయన మేజిస్ట్రేట్ కు తెలిపారు.


More Telugu News