సీమ ఎందుకు అభివృద్ధి చెందదు... భయపడితే ఏమీ చేయలేం: నారా లోకేశ్

  • కడప జిల్లాలో లోకేశ్ యువగళం
  • రాయలసీమ ప్రముఖులు, మేధావులు, ప్రజలతో లోకేశ్ భేటీ
  • సభికులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పిన లోకేశ్
రాయలసీమలో 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. పాదయాత్ర చేశా... సుదీర్ఘ పాదయాత్రలో సీమ ప్రజల పడుతున్న కష్టాలు చూశాను... అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ ద్వారా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తాం అంటూ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద మిషన్ రాయలసీమపై నిర్వహించిన సదస్సుకు రాయలసీమ నలుమూలల నుంచి పెద్దఎత్తున మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సదస్సులో టీడీపీ అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ పేరుతో రాబోయే అయిదేళ్లలో ఏంచేస్తామనే విషయమై లోకేశ్ విస్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. 

మిషన్ రాయలసీమపై సుమారు గంటన్నరపాటు సాగిన సదస్సుకు ఐఐఎం అల్యుమినా ప్రొఫెసర్ రాజేశ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సభికులు అడిగిన ప్రశ్నలన్నింటికీ లోకేశ్ నిర్మొహమాటంగా సమాధానాలిచ్చారు.

సదస్సులో అడిగిన ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు:

ప్రశ్న: 119 రోజులగా ఎండా, వానతో పాటు అక్కడక్కడ వైసీపీ నేతలు దాడుల్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న మిమ్మల్ని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తమ కష్టాలు తీర్చే నాయకునిగా చూస్తున్నారు. అతికొద్ది సమయంలో లక్షలాది ప్రజల మనసుల్లో ఎలా స్థానం సంపాదించగలిగారు?

లోకేశ్: పాదయాత్ర ప్రారంభించే ముందు అన్ని వర్గాల ప్రజలు తమను ప్రభుత్వం వేధిస్తోంది... మీరు రోడ్డు మీదకు రండని చెప్పిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించా. కుటుంబాన్ని చూడకుండా పాదయాత్ర చేయటానికి ప్రజల బలం, ప్రోత్సాహం కారణం. టీడీపీ నేతలు కూడా ప్రోత్సహించారు. అందరి ప్రోత్సాహం ఉండబట్టే కుటుంబం గురించి ఆలోచించకుండా నిరాటంకంగా పాదయాత్ర చేస్తున్నా.

ప్రశ్న: రాయలసీమ అంటే రౌడీయిజం... ఫ్యాక్షనిజం అనే ఆలోచన రావడం సహజం. 119 రోజుల్లో మీకు సీమ గురించి మీకు కలిగిన భావన ఏమిటి?

లోకేశ్: సీమ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఇంటికి ఎవరైనా వస్తే అప్పు తెచ్చైనా అతిథుల ఆకలి తీర్చుతారు. నడిచేటప్పుడు అప్పుడప్పుడు కొబ్బరిబోండా, బజ్జీలు, మజ్జిగ తాగి డబ్బులు ఇస్తే తీసుకోలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్ పోయింది. సీమ అంటే సెల్ ఫోన్ కంపెనీ, కియా కార్లు, మామిడి గుర్తు వస్తోంది. సీమకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు దీటుగా సీమ జిల్లాలను తీర్చిదిద్దుతాం.

ప్రశ్న: ఇంత వరకు సీమ నుండి ఏడుగురు సీఎంలు వచ్చారు... కానీ ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నాయి. బీడు భూములు, యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు. సీమ ప్రజలకు ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు?

లోకేశ్: 119 రోజుల్లో 1,516 కి.మీ నడిచా. గతంలో హంద్రీనీవా ద్వారా ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చాం. సబ్సీడీపై డ్రిప్ ఇచ్చాం. ఫాక్స్ కాన్, కియా, సెల్ కాన్ లాంటి పరిశ్రమలను టీడీపీ తీసుకొచ్చింది. కానీ జగన్ వచ్చాక 4 ఏళ్లలో సీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది. మహిళలు బిందెలు పట్టుకుని నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. 

టీడీపీ ఐదేళ్ల పాలనలో సీమలో చేసిన అభివృద్ధి కనబడింది. వైసీపీ నాలుగేళ్ల పాలనలో సీమ ఎంత నష్టపోయిందో అర్థమైంది. టీడీపీ నేతలు, నిపుణులతో చర్చించిన తర్వాతే మిషన్ రాయలసీమను రూపొందించాం. 

ఎంతో మంది ప్రయత్నించినా సక్సెస్ కాలేదని నాతో కొందరు చెప్పారు. చేయలేమనే భయంతో మనం బతకకూడదు. అందుకే నేడు మిషన్ రాయలసీమ ప్రకటించా. సీమబిడ్డ అని కొందరు బిల్డప్ లు ఇచ్చుకున్నారు. టీడీపీ వచ్చిన 5 ఏళ్లలో సీమను ఏ విధంగా తీర్చిదిద్దాలో మిషన్ రాయలసీమ ద్వారా చేసి చూపిస్తాం.

సాయితేజ, వరగలి, తిరుపతిజిల్లా: బి.టెక్ చదివి కూడా చిరు ఉద్యోగాలు లేవు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప వేరే ఏమీ లేవు. 20 లక్షల ఉద్యోగాలు ఏవిధంగా ఇస్తారో క్లారిటీ ఇవ్వండి.

లోకేశ్: టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాము. 40 వేల పరిశ్రమల ద్వారా 6 లక్షల ఉద్యోగాలు తెచ్చామని ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. డీఎస్సీ ద్వారా 35 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా చిత్తూరును తీర్చి దిద్దాలని అనుకున్నాం. ఓల్టాస్ ఏసీ కంపెనీని తీసుకొచ్చాం. కియా వల్ల అక్కడి ప్రజల తలసరి ఆదాయం రూ.20 వేలు పెరిగింది. పెద్ద పరిశ్రమలు తెస్తే నిరుద్యోగిత పోతుంది.
 
నారాయణస్వామి: పాదయాత్రలో మీకు బాధ కలిగించిన సంఘటన ఏమిటి? ఆ సమస్యకు పరిష్కారం ఏంటి?

లోకేశ్: నన్ను కదిలించిన సంఘటన గంగాధర నెల్లూరులో మోహన అనే అక్క ఘటన. చిన్నపాటి హోటల్ పెట్టుకుని తన ఇద్దరు బిడ్డల్ని చదవించుకుంది. కానీ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆమె నన్ను డబ్బులు, ఇళ్లు అడగలేదు. వారికి ఉద్యోగాలు కల్పించండని అడిగారు. ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే చంద్రబాబుతో చర్చించాక రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.

కృష్ణకుమార్: చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ అని అన్నారు. మీరు రాయలసీమకు ఏమైనా గ్యారంటీ ఇస్తారా?

లోకేశ్: పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. 24 గంటల పాటు కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తాం. పిల్ల కాల్వలు కూడా తవ్వించే బాధ్యత తీసుకుంటాం. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్, డిఫెన్స్, టూరిజం, మైనింగ్... ఈ ఐదింటిని ఫోకస్ గా అమలు చేస్తే సీమ అభివృద్ధిలో దూసుకుపోతుంది. తప్పకుండా సీమకు పరిశ్రమలు తెస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. 

2014లో ప్రజలు కర్నూలులో 3, కడపలో 1 సీటులో మాత్రమే టీడీపీని గెలిపించారు. అయినా మేము చిన్న చూపు చూడలేదు. కర్నూలు, కడపకు పెద్దగా పరిశ్రమలు రాకపోవడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యేలు సృష్టించిన అడ్డంకులే. గతంలో అవినాశ్ రెడ్డి వేదిక ఎక్కి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. వైసీపీకి ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి.. మేము చెప్పినవి చేయకపోతే నన్ను నిలదీయండి. నేను మాయమాటలు చెప్పను.

శ్వేత: పెట్రోల్ లీటర్ ధర రూ.80 లకు దిగొస్తేనే తాత టీవీఎస్ బయటకు తీస్తా అంటున్నారు... ఆ పరిస్థితి వస్తుందా.?

లోకేశ్: కర్నాటక – ఆంధ్రాకు పెట్రోల్ ధర వ్యత్యాసం రూ.13 ఉంది. పెట్రోల్, డీజిల్ పై ఈ ప్రభుత్వం దేశంలోనే అధికంగా రూ.30 సెస్ వేస్తోంది. పన్నుల ప్రక్షాళన చేసి ధరలు తగ్గించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వీటి ధరలు తగ్గితేనే నిత్యవసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. గ్యాస్ ధర రూ.1,350లకు పెరిగింది. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు, బస్ ఛార్జీలు 3 సార్లు పెరిగాయి.

సీమ నుంచి వలసలపై లోకేశ్ స్పందన

మంత్రాలయం పాదయాత్రలో గుంటూరు వలస వెళ్లి తిరిగి వస్తున్న వారిని చూశాను, చాలా బాధ కలిగింది. కుటుంబం ఇంటికి తాళం వేసి, వాహనంలో గుంటూరు వెళ్లి పనిచేసి తిరిగి రావడం చూశాను. ఇది బాబుగారు సీఎంగా ఉన్నపుడే గమనించి గుండ్రేవుల ప్రాజెక్టు శాంక్షన్ చేశాం. పనులు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తిచేస్తాం, ప్రతి ఎకరాకు నీరిస్తాం, వలస కూలీలకు ఉపశమనం కలిగిస్తాం.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1516.8 కి.మీ.*

*120వ రోజు పాదయాత్ర వివరాలు (8-6-2023)*

*రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం (అన్నమయ్య జిల్లా):*

సాయంత్రం

4.00 – కడప రాజరాజేశ్వరి కళ్యాణమండపం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.30 – టక్కోలి వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.50 – టక్కోలిలో రైతులతో సమావేశం.

6.20 – మాచుపల్లిలో స్థానికులతో మాటామంతీ.

6.50 – మాచుపల్లి పెన్నాక్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

8.05 – చంటిగారిపల్లి శివారు విడిది కేంద్రంలో బస.




More Telugu News