ఉండేది హైదరాబాద్ లో.. పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో: చంద్రబాబు, లోకేశ్ లపై రవీంద్రనాథ్ రెడ్డి విమర్శలు

  • చంద్రబాబు 14 ఏళ్లు సీఎం కావడం ప్రజల దురదృష్టమన్న రవీంద్రనాథ్ రెడ్డి
  • ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనత చంద్రబాబుదని విమర్శ
  • అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి జగన్ అని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల దురదృష్టమని ముఖ్యమంత్రి జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. వేల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని ఘనత చంద్రబాబుదేనని అన్నారు. పలానా పథకం అమలు చేశానని ధైర్యంగా చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఒక అవినీతి రాష్ట్రంగా పేరుగాంచిందని చెప్పారు. చంద్రబాబుకు చదువుకునే రోజుల్లో ఎంత ఆస్తి ఉంది? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత? అనేది ప్రజలందరికీ తెలుసని అన్నారు. 

చంద్రబాబు, నారా లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. జగన్ పై ఆరోపణలు చేయడం మినహా వీళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. 51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఘనత వైసీపీదేనని చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి జగన్ అని అన్నారు. ఐదేళ్లు పాలించిన వ్యక్తిని ప్రజలు దేవుడిలా చూస్తున్నారని... 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబును ఒక్కరైనా పూజిస్తున్నారా? అని ప్రశ్నించారు. మరోవైపు పాదయాత్ర సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను భూబకాసురుడు అని సంబోధిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ లపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు.


More Telugu News