రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా ఆయనకు కౌంటర్‌‌ ఇచ్చిన ఉప రాష్ట్రపతి

  •  రియర్‌వ్యూ మిర్రర్‌ లో చూస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న రాహుల్ గాంధీ
  • ఈ విమర్శలపై పరోక్షంగా స్పందించిన జగ్‌దీప్  ధన్ కర్
  • ప్రమాదం చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడానికి రియర్‌వ్యూ అద్దం చూడాలని చురక 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజకీయాలకు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే, భారత ఉప రాష్ట్రపతి జగ్‌‌దీప్ ధన్‌కర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించడం చర్చనీయాంశమైంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ, ఆరెస్సెస్ లపై విమర్శలు చేశారు. భవిష్యత్తు వైపు చూసే సామర్థ్యం వీటికి లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ కారును వెనక భాగం చూపించే అద్దంలో (రియర్‌వ్యూ మిర్రర్‌) చూస్తూ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. దీనివల్ల ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతోందని వ్యాఖ్యానించారు. 

మంగళవారం ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారులతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన జగ్‌దీప్ ధన్‌కర్.. రాహుల్ ప్రభుత్వం చేసిన విమర్శలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా చురకలు అంటించారు. దేశంలోని వ్యవస్థలపై బురదజల్లే వారిని దూరం పెట్టాలంటే రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదం చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడం కోసం రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాలని ఆయన వ్యాఖ్యనించారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. అయితే దేశంలోని కొందరు దీన్ని గర్వకారణంగా భావించడం లేదన్నారు. తప్పుడు మార్గదర్శనంలో నడుస్తున్న అలాంటి వారు భారత్ సాధిస్తున్న విజయాలను, మన సత్తాను తెలుసుకోలేక, అయోమయంలో ఉన్నారన్నారు.


More Telugu News