తెలంగాణ స్కూళ్ల అకడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల

  • జూన్ 12 నుంచే పాఠశాలల పున: ప్రారంభం
  • 2024 ఏప్రిల్ 24 చివరి పనిదినంగా నిర్ణయం
  • ఇకపై ప్రతీ నెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ 
తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లే ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు 2023-24 అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న చివరి పనిదినంగా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలని, ప్రతి నెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ గా పాటించాలని ఆదేశించింది. 

ఆ రోజంతా ఆటపాటలకే కేటాయించాలని పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రోజూ 30 నిమిషాల పాటు రీడింగ్, 5 నిమిషాలు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశం, మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు.

2024 జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్ పూర్తిచేయాలని ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. మార్చిలో పరీక్షల నేపథ్యంలో రివిజన్ తరగతులు నిర్ణయించాలని పేర్కొన్నారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు.. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది.


More Telugu News