బీసీలకు తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హతలు, నిబంధనలు ఇవే!

  • వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం
  • ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
  • పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థికసాయం
వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందించబోతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమయింది. ఈ నెల 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి గంగుల తెలిపారు. 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి మార్గదర్శకాలు:
  • లబ్ధిదారులు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులై ఉండాలి. 
  • వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలకు మించి ఉండకూడదు. 
  • పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే నిధులు అందిస్తారు. 
  • కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. 
  • గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక సాయం పొంది ఉండకూడదు. 
  • 2017-18లో రూ. 50 వేల ఆర్థికసాయం పొందినవారు కూడా అనర్హులు. 
  • వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలి. 
  • మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.  
  • ఎంపికైన లబ్ధిదారులను ఆన్ లైన్ లో ప్రకటిస్తారు. 
  • ఎంపికైన వారి బ్యాంకు ఖాతాకు నేరుగా ఆర్థికసాయాన్ని జమ చేస్తారు. ఆర్థికసాయం పొందిన నెలలోగా పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


More Telugu News