వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

  • భాస్కర రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ వాదనలు
  • కేసుతో సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారన్న భాస్కర రెడ్డి లాయర్లు
  • సునీత ఇంప్లీడ్ పిటిషన్ స్వీకరించిన సీబీఐ కోర్టు
  • లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర రెడ్డి బెయిల్ పిటిషన్ పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. భాస్కరరెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారని భాస్కర రెడ్డి తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. భాస్కర రెడ్డికి నేర చరిత్ర లేదని, ఆయన నేరం చేశాడనేందుకు సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.

ఈ క్రమంలో విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సునీత పిటిషన్ ను కూడా సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా, సునీతారెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఉత్తర్వులను సునీతా రెడ్డి సవాల్ చేశారు.


More Telugu News