తెలంగాణ రాకపోయి ఉంటే..: కాంగ్రెస్‌పై కేసీఆర్ నిప్పులు

  • రైతులను మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం
  • అందుకే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలుపుతానంటున్నారని వ్యాఖ్య
  • ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తే రైతులను ముంచినట్లే అన్న కేసీఆర్
  • కాంగ్రెస్ అధికారంలో ఉంటే దళారులదే రాజ్యమని మండిపాటు
రైతులను మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ... కోర్టుల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆరోపించారు. వారిని నమ్మి అధికారం ఇస్తే కనుక పంటికి అంటకుండా మింగేయడానికి సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నాడని, ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులను బంగాళాఖాతంలో వేసినట్లే అన్నారు. ధరణి రాకముందు అంతా లంచాలమయంగా ఉండేదని, ధరణి వల్ల ఒక శాతం సమస్యలు ఉంటే ఉండవచ్చునన్నారు. నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ధరణి పోర్టల్ లో మార్పులు చేసే అధికారం ముఖ్యమంత్రిని అయిన తనకే లేదని, ధరణి రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నప్పటికీ అధికారం ప్రజలకు ఇచ్చినట్లు చెప్పారు. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, హత్యలు జరిగి ఉండేవన్నారు. ధరణి ఉండాలా వద్దా.. రైతులను మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టు తిప్పేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే దళారులదే రాజ్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

మన వేలితో మన కళ్లనే పొడిపించేందుకు కొందరు దుర్మార్గులు సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యమన్నారు. మహారాష్ట్రకు వెళ్తే తెలంగాణ వంటి మోడల్ కావాలని కోరుతున్నారని, కాంగ్రెస్ దుర్మార్గులు మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే వీఆర్ఓలను పెడతాం.. మళ్ళీ మీ నెత్తురు తాగుతాం.. దోచుకుంటాం.. అనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నేను ఏది తలపెట్టినా దేవుడు నన్ను ఓడించలేదని, గెలిపిస్తూ వస్తున్నాడన్నారు.

తెలంగాణ వస్తే అంతా అంధకారమవుతుందని ఆంధ్రా నేతలు బెదిరించారని, కానీ ఇప్పుడు ఇదే తెలంగాణ వెలిగిపోతోందన్నారు. కానీ ఆంధ్రాలో చీకట్లు కమ్ముకున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తనను పాలమూరు నుండి గెలిపించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్ కర్నూలు జిల్లా కాకపోయి ఉండేదని, కార్యాలయాలు వచ్చి ఉండకపోయేవన్నారు.


More Telugu News