ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా...?: షర్మిల

  • కేసీఆర్ సర్కారీ భూములను కూడా వదలడంలేదని షర్మిల ఆరోపణ
  • కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని మండిపాటు
  • దొర ఆడిందే ఆట పాడిందే పాట అంటూ విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా... కేసీఆర్ రాజకీయాలకు భూములు కరవా... అంటూ విమర్శించారు. కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర... సర్కారీ భూములను సైతం వదలడంలేదని వ్యాఖ్యానించారు. ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని షర్మిల ఆరోపించారు. 

భారత్ భవన్ అట... 15 అంతస్తులట... ఎక్సలెన్స్ సెంటర్ పెడతాడట... ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా...? అంటూ మండిపడ్డారు.

"పార్టీ పేరు మార్చినంత మాత్రాన కొత్త భవనానికి సర్కారు భూమి ఇవ్వడమా? రూ.550 కోట్లు పలికే 11 ఎకరాల స్థలం రూ.37 కోట్లకే కొట్టేయడమా? దొర రాజకీయాలకు అగ్గువకే దొరికే సర్కారీ భూములు... పేదల సంక్షేమానికి మాత్రం కనబడవు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు ఉండవు. 36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి భూములు దొరకవు. అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు, గురుకులాలకు భూములు ఉండవు. చివరికి జర్నలిస్టులకు ఇవ్వడానికి స్థలాలు దొరకవు. 

కానీ దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్సలెన్స్ సెంటర్లకు మాత్రం అడగంగనే భూములు దొరుకుతయ్... రాత్రికి రాత్రే దొంగ జీవోలు, బదలాయింపులు జరిగిపోతాయ్. అధికారం చేతిలో ఉంది కదా అని దొర ఆడిందే ఆట, పాడిందే పాట" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.


More Telugu News