ఒడిశాలో సికింద్రాబాద్ - అగర్తల ఎక్స్ ప్రెస్ లో పొగలు
- బరంపూర్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం
- ఏసీ బోగీలో పొగలు రావడంతో హడలిపోయిన ప్రయాణికులు
- షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు సమాచారం
ఒడిశాలో చోటుచేసుకున్న ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో 278 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఇంకా మరువక ముందే మరో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటన కూడా ఒడిశాలోనే చోటుచేసుకుంది. సికింద్రాబాద్ - అగర్తల ఎక్స్ ప్రెస్ రైలు ఒడిశాలోని బరంపూర్ రైల్వే స్టేషన్ లో ఆగినప్పుడు బీ5 ఏసీ కోచ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. 45 నిమిషాల తర్వాత రైలు మళ్లీ బయల్దేరింది. అయితే మళ్లీ రైలు ఎక్కేందుకు కొందరు ప్రయాణికులు నిరాకరించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.