ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారనే..: జగన్‌పై పట్టాభి విమర్శలు

  • మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న పట్టాభి 
  • ఉద్యోగులతో భేటీ జరుపుతూనే.. మరోవైపు ఇళ్ళకు పోలీసులను పంపించి బెదిరించారని ఆరోపణ
  • రూ.7వేల కోట్లకు గాను రూ.175 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నమని విమర్శ 
మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉద్యోగుల సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కొత్త పీఆర్సీకి కమిటీ పేరుతో మరోసారి కాలయాపనకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నేతలతో నిన్న జరిగిన మీటింగ్ అంతా డ్రామానే అన్నారు. వారికి నిన్న ఏం న్యాయం జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఇవ్వాల్సిన బకాయిలను ఇన్‌స్టాల్ మెంట్ పద్ధతిలో చెల్లిస్తామనడం ఏమిటన్నారు.

రూ.7 వేల కోట్లకు గాను రూ.175 కోట్లు మాత్రమే ఇప్పుడు చెల్లిస్తామని చెప్పారని, రేపు మార్చి తర్వాత మీ ప్రభుత్వం ఎలాగూ ఉండదు.. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు.. కాబట్టి మిగతా మొత్తం వచ్చే ప్రభుత్వం చూసుకోవాలని చేతులు దులుపుకున్నారన్నారు.

జగన్ పదవీ కాలం పూర్తయ్యే నాటికి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.7వేల కోట్లలో ఈయన ఇచ్చేది కేవలం రూ.175 కోట్లు మాత్రమే అన్నారు. జగన్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటారన్నారు. 11వ పీఆర్సీ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదని, మళ్లీ 12వ పీఆర్సీ నివేదిక కాలయాపన కోసమే అన్నారు.


More Telugu News