చిన్న సమస్య తలెత్తితే విపత్తుగా చూపించే దౌర్భాగ్యపు మీడియా మన రాష్ట్రంలో ఉంది: ఏపీ సీఎం జగన్
- పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన జగన్
- గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని విమర్శ
- ఆ ఖాళీల్లో వరద వేగంతో ప్రవహించడం వల్ల నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడి
ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య తలెత్తితే విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌బండ్ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు దీన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని పని చేయాలని సూచించారు.
మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని జగన్ పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది’’ అని తెలిపారు.
‘‘ఈఎస్‌ఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రం వాల్ దారుణంగా దెబ్బతింది. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే రామోజీరావు బంధువులకే పనులు అప్పగించారు’’ అని విమర్శించారు.
‘‘ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న సమస్యలు వస్తాయి. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారు. ప్రాజెక్టులో ఇలాంటి ఓ చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉంది’’ అని విమర్శలు చేశారు.