రైలు ప్రయాణికులకు కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!

  • రైలు టికెట్ కు అనుబంధంగా బీమా సదుపాయం
  • ఐఆర్ సీటీసీ ద్వారా బుకింగ్ సమయంలో ఎంపికకు అవకాశం
  • ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పాలైనా పరిహారం
మనలో చాలా మంది ఐఆర్ సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో చౌకగా వచ్చే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. కేవలం 35 పైసలకే వస్తున్న జీవిత బీమాను కొనుగోలు చేసుకోవడం ఎంతో లాభదాయకం. దీన్ని చాలా మంది ఎంపిక చేసుకోవడం లేదు. జీవిత బీమాను స్వచ్చంద ఎంపికగానే ఐఆర్ సీటీసీ అమలు చేస్తోంది. నిజానికి ఇంత తక్కువ రేటుకు వచ్చే బీమా మరేదీ లేదు. రైలు టికెట్ అంటే రూ.100 తక్కువ ఉండదు. అంత పెడుతున్నప్పుడు కేవలం 35 పైసల ఖర్చుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అదేమంత అవసరపడదులేనన్న ఉద్దేశ్యంతో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు.

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తర్వాత మరోసారి ఈ చౌక ఇన్సూరెన్స్ ఎంత విలువైనదో తెలియవచ్చింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ బీమా సుదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బీమాను ఎంపిక చేసుకున్న వారికి.. ప్రమాదంలో మరణించినట్టయితే రూ.10లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైలక్యం పాలైనా రూ.10 లక్షలు అందుకోవచ్చు. శాశ్వత పాక్షిక అంగవైకల్యం పాలైన వారికి రు.7.5 లక్షలు చెల్లిస్తారు. గాయాలతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే రూ.2 లక్షలు ఇస్తారు. శవ తరలింపునకు అయ్యే రవాణా వ్యయాల కోసం రూ.10వేలు చెల్లిస్తారు.


More Telugu News