హైదరాబాద్‌లో ఐటీలో ఉద్యోగాలు పెరిగాయ్, ఎగుమతులు పెరిగాయ్: కేటీఆర్

  • ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ దూసుకెళ్తోందని వ్యాఖ్య
  • ఐటీ ఉత్పత్తులు రూ.56వేల కోట్ల నుండి రూ.1.83 వేల కోట్లకు పెరిగినట్లు వెల్లడి
  • ఉద్యోగాలు 3.20 లక్షల నుండి 7 లక్షలు దాటాయన్న కేటీఆర్
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను నిలబెట్టినట్లు చెప్పారు. టీ-హబ్ లో ఐటీ శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 2013-14లో హైద‌రాబాద్‌లో ఐటీ ఉత్ప‌త్తులు రూ.56 వేల కోట్లుగా ఉన్నాయని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక ల‌క్ష 83 వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమ‌తుల‌కు చేరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన స‌మ‌యంలో ఐటీ రంగంలో 3 ల‌క్ష‌ల 20 వేల ఉద్యోగాలు ఉండగా, ఇప్పుడు 7 ల‌క్ష‌ల‌ పైకి చేరుకున్నాయన్నారు. 

 ఐటీ రంగానికి కేంద్రం నుంచి స‌హ‌కారం లేదన్నారు. మాట సాయం త‌ప్ప కేంద్రం ఎలాంటి అండ‌దండ‌లు అందించ‌లేదన్నారు. యూపీఏ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు కేటాయించిన ఐటీఐఆర్‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిందని, అయిన‌ప్ప‌టికీ తెలంగాణ నిలదొక్కుకొని, ఐటీ రంగాన్ని అగ్రభాగాన నిలబెట్టిందన్నారు. రెండేళ్ల పాటు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ దీనిని అధిగమించామన్నారు. ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటుకొని వెళ్తున్నట్లు చెప్పారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాదును మార్చామన్నారు.

అమెరికాకు చెందిన క్వాల్ కామ్, గ్రిడ్ డైనమిక్స్ సహా వివిధ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. జర్మనీకి చెందిన బాష్ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. గూగుల్ అతిపెద్ద కేంద్రాన్ని నిర్మిస్తోందని, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తోందన్నారు. మన దేశానికి చెందిన ఎల్ అండ్ టీ వరంగల్ లో పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. వాషింగ్టన్ కు చెందిన రెండు సంస్థలు బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు.


More Telugu News