మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • జోధ్‌పూర్‌ ప్రజలకు తాను ప్రథమ సేవకుడినన్న రాజస్థాన్ సీఎం
  • ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని వెల్లడి
  • అవసరమైతే మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు సంపాదిస్తానని వ్యాఖ్య
  • ప్రొఫెషనల్‌ మెజీషియన్ల కుటుంబంలో పుట్టిన అశోక్‌ గెహ్లాట్
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పూర్‌ ప్రజలకు తాను ప్రథమ సేవకుడినని అన్నారు. జోధ్ పూర్ అభివృద్ధి కోసం అవసరమైతే మ్యాజిక్‌ చేసైనా సరే డబ్బులు సంపాదిస్తానని చెప్పుకొచ్చారు. కొత్తగా నిర్మించిన ‘రావు జోధా మార్గ్‌’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘‘42 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నుంచి నేను తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాను. అప్పుడు జోధ్‌పుర్‌ ఎలా ఉండేది? నీళ్లు లేవు.. రైళ్లు లేవు. కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయాయి. నీటి సరఫరా, విద్యుత్‌, రైళ్లు, రోడ్లు, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చగలిగాను’’ అని చెప్పారు.

జోధ్‌పుర్‌పై ఎవరైనా అధ్యయనం చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో కచ్చితంగా తెలుసుకుంటారని అన్నారు. ఇలాంటి గొప్ప పట్టణానికి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తా. అవసరమైతే మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చి అయినా సరే డబ్బులు సంపాదిస్తా.. అంతేగానీ జోధ్‌పుర్‌ ప్రజలను నిరాశపర్చను’’ అని అన్నారు. ప్రొఫెషనల్‌ మెజీషియన్ల కుటుంబంలో అశోక్‌ గెహ్లాట్ జన్మించారు.

‘మ్యాజిక్‌’ చేస్తానంటూ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. సీఎం తన పదవీకాలంలో కేవలం మ్యాజిక్‌ ట్రిక్స్‌ మాత్రమే ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. కేంద్రం ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి తమవిగా చెబుతున్నారని ఆరోపించింది. ‘‘ప్రభుత్వ ఆఫీసుల్లో బంగారం, నగదు దొరికాయి. అది మ్యాజిక్‌ కాకపోతే మరేంటీ?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ ఎద్దేవా చేశారు.


More Telugu News