ఇంకెంత మందిపై దాడి చేస్తారు.. మీ కళ్లమంట చల్లారలేదా?: దేవినేని ఉమ మండిపాటు

  • జగన్‌ కనుసన్నల్లో, సజ్జల డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్న ఉమ
  • ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా అని నిలదీత
  • మంత్రి కాకాణి, సీఎం బాధ్యత వహించాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సబబా అని ప్రశ్నించారు. ఇంకెంత మందిపై దాడి చేస్తారని నిలదీశారు. సీఎం జగన్‌ కనుసన్నల్లో, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 

నెల్లూరులో మీడియాతో దేవినేని ఉమ మాట్లాడుతూ.. ‘‘ఇంకెంత మందిపై దాడి చేస్తారు? మీ కళ్లమంట చల్లారలేదా? ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? ఇదేం సంస్కృతి? రాష్ట్రం ఎటు పోతుంది?’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఆజ్ఞ లేనిదే ఇలాంటి దాడులు జరగవని ఆరోపించారు.

ప్రతిపక్ష నేతలతోపాటు టీడీపీ కార్యాలయంపైనా దాడులు చేశారని దేవినేని ఉమ విమర్శించారు. దాడుల కుట్రదారులెవరో బయటకు రావాలని, దీనికి మంత్రి కాకాణి, సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘‘జగన్‌ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్‌లోనే దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎస్పీ, డీఐజీ, డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

ఆదివారం మధ్యాహ్నం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై కొందరు దాడికి యత్నించారు. నెల్లూరులోని బీవీనగర్‌లో తన కార్యాలయం నుంచి కిందికి దిగుతున్న ఆయనపై కొందరు యువకులు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. అప్రమత్తమైన టీడీపీ నాయకులు, ఆనం అనుచరులు వారిని ప్రతిఘటించారు. దీంతో దుండగులు తాము వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు, తీసుకొచ్చిన కర్రలు అక్కడే వదిలి పరారయ్యారు.


More Telugu News