విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ విడుదల.. టాప్​10లో హెచ్​సీయూ

  • 2022 ఏడాదికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం
  • యూనివర్సిటీల విభాగంలో ఓయూకు 22, ఏయూకు 36వ ర్యాంక్
  • ఫార్మసీ విభాగంలో నైపర్‌‌కు రెండో స్థానం
2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టాప్10లో చోటు సాధించింది. హెచ్‌సీయూకి పదో ర్యాంక్ దక్కింది. ఎన్ఐటీ - వరంగల్ కి ఓవరాల్ ర్యాంకింగ్‌లో 45వ స్థానం దక్కగా, ఉస్మానియా యూనివర్సిటీ  46వ స్థానం లభించింది. యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ స్థానం, ఆంధ్రా యూనివర్సిటీకి 36వ స్థానం దక్కాయి.  

ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్ర స్థానం కైవసం చేసుకుంది. ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ వరుసగా 2,3,4వ స్థానాల్లో నిలిచాయి. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో ఐఐఎస్సీ-బెంగళూరు టాప్ ర్యాంక్ అందుకోగా,  రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి.

ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ (మద్రాస్) మొదటి స్థానం దక్కించుకోగా, ఐఐటీ (హైదరాబాద్) పదో స్థానం, ఎన్ఐటీ (వరంగల్) 21వ స్థానాలు సాధించాయి. ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్– హైదరాబాద్) రెండో స్థానం కైవసం చేసుకోవడం విశేషం. ఆర్కిటెక్చర్ విభాగంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ) 7వ స్థానం సాధించింది. లా విభాగంలో 4వ స్థానంలో నల్సార్ యూనివర్సిటీ (హైదరాబాద్) నిలిచింది.


More Telugu News