కాంగ్రెస్ ఎన్నడూ సాకులు చెప్పలేదు.. నైతిక బాధ్యత వహించడానికి సిగ్గుపడలేదు: రాహుల్ గాంధీ
- మోదీ వెనుక అద్దంలో చూస్తూ ఇండియన్ కారును నడుపుతున్నారన్న రాహుల్
- ఒడిశాలో రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే.. గతంలో కాంగ్రెస్ చేసిందని చెబుతారని సెటైర్
- ప్రధాని, బీజేపీ నేతలు గతాన్నే తవ్వుతారని, భవిష్యత్ ను ఆలోచించరని మండిపాటు
- వారి వైఫల్యాలకు గతంలోని వ్యక్తుల్ని, ప్రభుత్వాలను నిందిస్తుంటారని విమర్శ
- కాంగ్రెస్ హయాంలో దుర్ఘటన జరిగితే నైతిక బాధ్యతగా రైల్వే మంత్రి రాజీనామా చేశారని వ్యాఖ్య
ప్రధాని మోదీ వెనుక అద్దంలో చూస్తూ భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించదని చెప్పారు. భవిష్యత్ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు లేవని ఎద్దేవా చేశారు. ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమని, ప్రేమతో మాత్రమే నివారించగలమని చెప్పారు.
అమెరికా పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘‘మీరు వారిని (బీజేపీ) ఏదైనా అడగండి. వారు వెనక్కి తిరిగి (గత ప్రభుత్వాలే కారణమని).. నిందలు వేస్తారు. ఒడిశాలో రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగితే.. 50 ఏళ్ల కిందట కాంగ్రెస్ చేసిందని చెబుతారు’’ అని మండిపడ్డారు. ఏం జరిగినా గత ప్రభుత్వాలను విమర్శించడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు.
అమెరికా పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘‘మీరు వారిని (బీజేపీ) ఏదైనా అడగండి. వారు వెనక్కి తిరిగి (గత ప్రభుత్వాలే కారణమని).. నిందలు వేస్తారు. ఒడిశాలో రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగితే.. 50 ఏళ్ల కిందట కాంగ్రెస్ చేసిందని చెబుతారు’’ అని మండిపడ్డారు. ఏం జరిగినా గత ప్రభుత్వాలను విమర్శించడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన దుర్ఘటనలకు నైతిక బాధ్యత వహించి అప్పటి రైల్వే మంత్రి రాజీనామా చేశారని రాహుల్ గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రైలు ప్రమాదం నాకు గుర్తుంది. తప్పు బ్రిటిష్ వాళ్లదని, వారివల్లే ప్రమాదం జరిగిందని నాడు కాంగ్రెస్ చెప్పలేదు. ‘ఇది నా బాధ్యత. కాబట్టి నేను రాజీనామా చేస్తాను’ అని అప్పుడు కాంగ్రెస్ మంత్రి చెప్పారు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉన్న సమస్య. సాకులు చెబుతున్నారు. తప్పులను ఒప్పుకోవడం లేదు’’ అని ఆరోపించారు. కానీ తమ పార్టీ నైతిక బాధ్యత వహించడానికి ఏనాడూ సిగ్గుపడలేదని అన్నారు.
దేశంలో రెండు సిద్ధాంతాల మధ్యే పోరాటం జరుగుతోందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య పోరాటం. గాంధీజీ ముందుచూపు గలవారు.. ఆధునికుడు.. ఓపెన్ మైండెడ్. అదే గాడ్సే గతం గురించి మాట్లాడారు.. భవిష్యత్ గురించి మాట్లాడలేదు.. ఆయన కోపం, ద్వేషంతో ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ఆయన (మోదీ) ఇండియా అనే కారును నడిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముందుకు చూడకుండా కారు వెనుక అద్దంలో చూసి నడుపుతున్నారు. కారు ముందుకు పోకుండా, ఎందుకు ప్రమాదాలకు గురవుతోందో ఆయనకు అర్థం కావడం లేదు. దేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ప్రధాని, మంత్రులు, బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్.. అంతా ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాట్లాడినట్లు మనకు కనిపించదు. వారెప్పుడూ గతాన్నే తవ్వుతారు. వారు ముందుకు చూడలేకపోతున్నారు. వారి వైఫల్యాలకు గతంలోని వ్యక్తుల్ని, ప్రభుత్వాలను నిందిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు.