చిన్నారులను జోకొట్టేందుకు మెషిన్లు.. విచారం వ్యక్తం చేసిన హర్ష గోయంకా

  • విదేశాల్లో విరివిగా ఎలక్ట్రానిక్ ఉయ్యాలల వినియోగం
  • తల్లి స్పర్శకు ఇది ప్రత్యామ్నాయం అవుతుందా? అంటూ గోయంకా ప్రశ్న
  • కానే కాదంటున్న నెటిజన్లు
  • 5-10 నిమిషాలకు అయితే ఓకేనన్న అభిప్రాయం
కాలం మారిపోతోంది. చిన్నారుల ఆలనా, పాలనా చూసేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితులు తల్లులకు వచ్చేస్తున్నాయి. మన దేశంలో తక్కువే అయినా, కొన్ని దేశాల్లో ఇలాంటి దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్నారి ఏడిస్తే తల్లి లాలిస్తుంది. పాలిస్తుంది. జోలపాట పాడుతుంది. కాళ్లపై లేదంటే ఉయ్యాల్లో వేసి అటూ, ఇటూ ఊపుతూ నిద్రబుచ్చుతుంది. ఇప్పుడింత శ్రమ అక్కర్లేకుండా మెషిన్లు వచ్చేశాయి. మన దేశంలో ఇవి రూ.7,000-8,000 ధరల్లో లభిస్తున్నాయి.

మెషిన్ పై చిన్నారిని పడుకోబెడితే చాలు. చక్కగా అటూ, ఇటూ కదులుతూ, చిన్నారులు ఏడవకుండా చేసే ఎలక్ట్రానిక్ ఉయ్యాల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇందుకు సంబంధించి వీడియోని పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు. ‘‘కన్నతల్లి ప్రేమతో లాలించే దానితో దీన్ని పోల్చగలమా?’’అని ప్రశ్న సంధించారు. దీనికి నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. పిల్లలు ఎదిగే క్రమంలో తల్లి స్పర్శ ఎంతో అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి ప్రణబ్ అనే మహిళ మాత్రం తన స్వీయ అనుభవం నుంచి ఓ కామెంట్ పెట్టింది. అస్తమానం ఈ మెషిన్ కాకుండా.. తల్లికి అత్యవసర సమయాల్లో 5-10 నిమిషాల పాటు ఎంతో సాయంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


More Telugu News