టీడీపీ ఎమ్మెల్యే ‘డోలా’ ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం.. నాయుడుపాలెంలో ఉద్రిక్తత

  • గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపణ
  • వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం
  • అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరిన టీడీపీ నేతలు
  • మార్గమధ్యంలోనే అడ్డుకుని ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు.  

మరోవైపు, వైసీపీ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వామనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


More Telugu News