ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ!

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • 288 మంది దుర్మరణం
  • సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయం
  • రైల్వే బోర్డు సీబీఐ విచారణకు సిఫారసు చేసిందన్న మంత్రి అశ్విని వైష్ణవ్
ఒడిశాలో 288 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కేంద్ర రైల్వే బోర్డు సిఫారసు చేసిందని వివరించారు. 

ఘటన స్థలంలో సహాయ చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, ప్రమాదం సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిమిత వేగంతోనే ప్రయాణిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ కూడా సజావుగానే ఉందని, కానీ అందులో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిగ్నలింగ్ లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొనడం తెలిసిందే.


More Telugu News