కేంద్ర మంత్రి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • అసోంలోని గువాహటి నుంచి డిబ్రూగఢ్ కు 150 మందితో బయల్దేరిన విమానం 
  • గాల్లోకి లేచిన 15 నిమిషాల్లోనే ఇంజిన్ లో సమస్యను గుర్తించిన పైలట్
  • గువాహటి విమనాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్
  • కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రయాణికులు సేఫ్
కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తెలి సహా 150 మందితో వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అస్సాంలోని గువాహటి విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనను గువహాటి ఎయిర్‌పోర్టు వర్గాలు ధ్రువీకరించాయి.

ఆదివారం ఉదయం 8.40 సమయంలో అసోంలోని గువాహటి నుంచి డిబ్రూగఢ్ కు విమానం బయల్దేరింది. కానీ 20 నిమిషాల్లోనే వెనక్కి వచ్చింది. ఇంజిన్ లో సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. 

ఈ విషయంపై కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తెలి మాట్లాడుతూ.. ‘‘నేను, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌, తెరస్‌ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరాను. దులియాజన్‌, టింగ్‌ఖాంగ్‌, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లోనే గువహాటి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేము సురక్షితంగా ఉన్నాం’’ అని తెలిపారు. 

తాను ఇంకా విమానాశ్రయం లోనే ఉన్నానని, ఆ విమానం నడవదని అధికారులు చెప్పారని రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. మరోవైపు దిబ్రూగఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువాహాటి ఎయిర్‌పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 150 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. తనిఖీల కోసం విమానాన్ని పంపినట్లు చెప్పాయి.


More Telugu News