గొడ్డలి పోటును గుండె పోటుగా ఎలా చిత్రీకరించాలో చెప్పే కోర్సులు... గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు

  • హైదరాబాద్ వైపు కోచింగ్ సెంటర్లలో సీ, సీప్లస్, జావా, ఒరాకిల్...
  • బెయిల్ ఎలా పొందాలి? సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలనే కోర్సులు ఏపీలో..
  • పేద ప్రజలను దోచుకోవడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని బుచ్చయ్య మండిపాటు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పేదలని కొట్టి, దోచుకోవడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్పిస్తుంటే.. ఏపీ వైపు మాత్రం ‘గొడ్డలి పోటును గుండె పోటుగా ఎలా చిత్రీకరించాలో నేర్పుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. గోరంట్ల పలుకు పేరుతో ఈ మేరకు ట్వీట్లు చేశారు.

‘‘హైదరాబాద్ వైపు కోచింగ్ సెంటర్లలో సీ, సీప్లస్, జావా, ఒరాకిల్, ఎస్ క్యూఎల్ కోర్సులు నేర్పుతున్నారు.. ఏపీ వైపు ఉన్న కోచింగ్ సెంటర్లలో మాత్రం గొడ్డలి పోటును గుండె పోటుగా ఎలా చిత్రీకరించాలి? బెయిల్ ఎలా పొందాలి? సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలి? నిపుణులైన ఫ్యాకల్టీ స్మాష్ రెడ్డి ఆధ్వర్యంలో.. మోసపు రెడ్డి సారథ్యంలో..’’ అంటూ సెటైర్లు వేశారు.

‘‘విద్యుత్ శాఖ మంత్రి మైనింగ్ లో బిజీ.. వైద్య శాఖ మంత్రి భజనలో బిజీ.. అన్నీ చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి పేదలని కొట్టి, దోచుకోవటంలో బిజీ. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే, రాష్ట్రం ఇలా కాక ఎలా ఉంటుంది?’’ అని మండిపడ్డారు. ‘‘అల్లూరి జిల్లాలోని ఓ ప్రాథమిక ఆసుపత్రిలో కరెంటు లేక, సెల్ ఫోన్ వెలుగులో వైద్యం చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. డాక్టర్లు అందుబాటులో లేక, నర్సులతో వైద్యం చేయించారు’’ అని ట్వీట్ చేశారు.


More Telugu News