భారత్‌తో WTCకి ముందు... టెస్ట్ క్రికెట్ కు డేవిడ్ వార్నర్ గుడ్‌బై!

  • జనవరిలో పాక్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలుకుతానని వెల్లడి
  • గత రెండేళ్లలో 17 టెస్టుల్లో ఒక్క సెంచరీ మాత్రమే చేసిన వార్నర్
  • 103 టెస్ట్ మ్యాచ్ లలో 25 సెంచరీల నమోదు
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ శనివారం టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి నాలుగు రోజుల ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తో జూన్ 7 నుండి జరగనున్న టోర్నీ కోసం వార్నర్ శ్రమిస్తున్నాడు. జనవరిలో పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని వార్నర్ చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని కూడా చెప్పాడు. 

శనివారం బెకెన్‌హామ్‌లో వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ, 2024 ప్రపంచ కప్ బహుశా తన ఆఖరి మ్యాచ్ అని తాను గతంలోనే చెప్పానని అన్నాడు. 36 ఏళ్ల వార్నర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతను ఆడిన 17 టెస్టుల్లో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. అయితే వార్నర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో జట్టు విఫలమైనప్పటికీ, అతను రాణించాడు. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ ను మరో ఏడాది కొనసాగించాలని భావిస్తున్నాడు.

తన టెస్ట్ కెరీర్‌లో, డేవిడ్ వార్నర్ మొత్తం 103 మ్యాచ్‌లు ఆడి 8,159 పరుగులు చేశాడు. అతని పేరు మీద 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 142 వన్డేలు ఆడి 19 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేశాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు.


More Telugu News