ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స

  • ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
  • ఒడిశాకు మంత్రి అమర్నాథ్ సహా అధికారులను పంపించినట్లు వెల్లడి
  • రెండు రైళ్లలో ఎంతమంది ఉన్నారో వెల్లడించిన బొత్స
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష జరిగిందని, రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతులను త్వరితగతిన తీసుకు రావాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్ రెడ్డి, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపించినట్లు చెప్పారు.

కోరమాండల్ లో 482 మంది ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారని, అందులో 309 మంది విశాఖపట్నంలో దిగాల్సిన వారు, 31 మంది రాజమండ్రిలో దిగాల్సిన వారు, ఐదుగురు ఏలూరులో దిగాల్సిన వారు, 137 మంది విజయవాడలో దిగాల్సిన వారు ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉన్నారని, 20 మంది స్వల్పంగా గాయపడ్డారన్నారు. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారన్నారు. 113 మంది ఫోన్లు ఎత్తుకు పోవడం లేదా స్విచ్చాఫ్ కావడం జరిగిందన్నారు. వీరి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.

యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీ నుండి 89 మంది రిజర్వ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ నుండి 33, రాజమండ్రి నుండి ముగ్గురు, ఏలూరు నుండి ఒక్కరు, విజయవాడ నుండి 41 మంది, బాపట్ల నుండి 8 మంది, నెల్లూరు నుండి ముగ్గురు ఉన్నట్లు చెప్పారు. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వల్పంగా గాయాలయ్యాయన్నారు. పదిమంది రైలు ఎక్కలేదని చెప్పారు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో లేదా స్విచ్ఛాఫ్ చేయడమో జరిగిందన్నారు.


More Telugu News