రోగిని ప్రేమించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు: చిరంజీవి

  • హైదరాబాద్ నానక్ రామ్ గూడలో స్టార్ క్యాన్సర్ ఆసుపత్రి
  • ప్రారంభోత్సవానికి హాజరైన చిరంజీవి
  • అప్పట్లో తాను కూడా డాక్టర్ నే అంటూ చిరు చమత్కారం
హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో స్టార్ క్యాన్సర్ సెంటర్ నెలకొల్పారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

తన సూపర్ హిట్ చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని ఓ డైలాగుతో చిరంజీవి ప్రసంగం ప్రారంభించారు. రోగిని ప్రేమించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు అని చిరంజీవి చెప్పగా, సభికుల నుంచి హర్షధ్వానాలు వెలువడ్డాయి. కానీ ఇక్కడున్న డాక్టర్లందరూ రోగులను మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్లేనని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అప్పట్లో నేను కూడా డాక్టర్ నే... ఫేక్ డాక్టర్ ని అంటూ చిరంజీవి చమత్కరించారు. 

ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల వైద్య సేవలు అందించేలా స్టార్  క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించడం హర్షణీయం అని పేర్కొన్నారు. 

ఈ ఆసుపత్రి వారు అత్యంత ఆధునిక ఎక్విప్ మెంట్ ను కొనుగోలు చేశారని, అయితే, వారు ఆ యంత్ర పరికరాలు ఉపయోగించే అవసరం రాకుండా ఉండాలని, వారు ఈగలు తోలుకుంటూ ఉన్నా ఫర్వాలేదని తనదైన శైలిలో నవ్వించారు. వాళ్లకు లాభాలు రాకపోయినా ఫర్వాలేదు... ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ క్యాన్సర్ బారినపడకూడదన్నదే తన ఉద్దేశమని, ప్రజలు క్యాన్సర్ బారిన పడకపోతే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు కదా అని వివరించారు. 

వ్యసనాలకు లోనుకాకుండా ఉంటే, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటే, క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువ అని చిరంజీవి స్పష్టం చేశారు. 

ఇటీవల విజయవాడ నుంచి రేణుక అనే అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతూ వచ్చిందని, తన ఆఖరి కోరికగా చిరంజీవిని చూడాలని ఉందని చెప్పిందని వెల్లడించారు. అయితే, తాను ఆ అమ్మాయిని కలిశానని, ఇది చివరి కోరిక కాదమ్మా, ఇదే నీ మొదటి కోరిక అనుకో... నువ్వు ఇంకా జీవిస్తావు అని ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగించానని, ఇప్పుడా అమ్మాయి బాగానే ఉందని చిరంజీవి తెలిపారు. 

అంతేకాకుండా, పేదవాళ్లు, తన అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ ముందుగానే గుర్తించేలా ఏవైనా పరీక్షలు ఉంటే చేయాలని, అందుకోసం ఎన్ని కోట్లయినా తాను కూడా తన వంతు సహకారం అందిస్తానని చిరంజీవి వెల్లడించారు. 

అందుకు స్టార్ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం స్పందిస్తూ, చిరంజీవి అద్భుతమైన ఆలోచన అందించారని, తమకు తగిన సాధన సంపత్తితో కూడిన మొబైల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారని, జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చింది.


More Telugu News