రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. కదిరిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!

  • సత్యసాయి జిల్లా కదిరిలో రైల్వే గేటు వేయని సిబ్బంది
  • రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు అక్కడ గేట్ మన్ లేని వైనం
  • లోకో పైలట్, స్థానికుల అప్రమత్తతతో తప్పిన మరో ప్రమాదం
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవలేదు. ఆ ఘటనను చూసైనా అప్రమత్తంగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కదిరిలో రైల్వే గేటును వేయడం మరిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. స్థానికులు, రైలు లోకో పైలట్ అప్రమత్తం కావడంతో మరో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సత్యసాయి జిల్లా కదిరిలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటుతుండటం, గేటు వేయకపోవడం గమనించి లోకో పైలట్‌ రైలును ఆపేశారు.

ఈ సమయంలో అక్కడ గేట్ మ్యాన్ కానీ, ఇతర రైల్వే సిబ్బంది కానీ లేకపోవడం గమనార్హం. ఎంత సేపటికీ గేటు వేయకపోవడంతో.. లోకో పైలట్ గేట్ మన్ ఉండే గదిలోకి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీలో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి ఒడిశాలో ప్రమాదం జరిగిన తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం.


More Telugu News