భార్యను కలవలేకపోయిన మనీశ్ సిసోడియా!

  • అనారోగ్యంతో ఉన్న భార్య సీమాను కలిసేందుకు సిసోడియాకు హైకోర్టు అనుమతి
  • ఈ రోజు ఉదయం ఇంటికి తీసుకెళ్లిన అధికారులు
  • అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు 
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు మనీశ్‌ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. కానీ అనుకోని సంఘటనతో సిసోడియా తన భార్య సీమాను చూడలేకపోయారు. ఆయన ఇంటికి చేరుకోవడానికన్నా ముందే ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సిసోడియా భార్యను ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ‘‘అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు ఉదయం 9.38 గంటలకు మధుర రోడ్‌లోని ఎబి-17కి జైలు వ్యాన్‌లో సిసోడియా చేరుకున్నారు. గట్టి భద్రత మధ్య ఆయన్ను ఇంటిలోకి తీసుకెళ్లారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కలవలేకపోయారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది’’ అని ఆప్ నేతలు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్‌ సిసోడియాను సీబీఐ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. ఇదే కేసులో మార్చి 9న ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో అప్పటినుంచి ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.


More Telugu News