ఒడిశా రైలు ప్రమాదం: ‘కవచ్’ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది!

  • ఒడిశా రైలు ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదన్న అధికారులు
  • రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వస్తే ఢీకొనకుండా ఆపే వ్యవస్థ
  • 2022లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ
  • దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు.. 
ఆ ఒక్కటీ ఉండి ఉంటే.. రైలు క్షేమంగా గమ్యానికి చేరేది. ఆ ఒక్కటీ ఉండి ఉంటే.. ఘోర ప్రమాదం తప్పేది..
ఈ పాటికి అందరూ తమ వాళ్లతో.. తమ పనుల్లో ఉండే వాళ్లు.. అంతా యథాతథంగా కొనసాగేది. వందల ప్రాణాలు నిలిచేవి.. వేల మందికి కన్నీళ్లు తప్పేవి.. కానీ దురదృష్టం వెంటాడింది.. విధి మరోలా తలచింది..

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ప్రమాదం జరిగిన రైల్వే రూట్ లో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదని తాజాగా వెల్లడైంది. రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే ఈ సిస్టమ్ ఉండుంటే.. ప్రమాదం జరిగేది కాదని అధికారులు అంటున్నారు.

ఏదైనా లోపం వల్లో, మానవ తప్పిదం వల్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినప్పుడు.. అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ 2022లో ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇదో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

రెండు రైళ్లు ఒకే ట్రాక్‌లో వస్తే.. అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. రైలు వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. తక్కువ వెలుతురు ఉన్న సమయంలో రైళ్లు సురక్షితంగా నడిచేలా సాయపడుతుంది. నిర్ణీత సమయంలో డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమైతే.. ఆటోమేటిక్ గా బ్రేకులు వేస్తుంది. ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఈ వ్యవస్థను స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరీక్షించారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు వచ్చినప్పుడు.. 380 మీటర్ల దూరంలోనే ట్రైన్ ఆగిపోయినట్లు ప్రకటించారు. 

ప్రస్తుతం ఈ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 రూట్ కిలోమీటర్లు కవర్ అయ్యాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కవచ్ టెక్నాలజీని అమల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ కవచ్ వ్యవస్థ ఇంకా ఒడిశా రూట్లలో అందుబాటులోకి రాలేదు. అందుకే ఈ ఘోర ప్రమాదాన్ని ఆపలేకపోయింది. ‘‘రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తున్నాం. ఈ మార్గంలో కవచ్ సిస్టమ్ అందుబాటులో లేదు’’ అని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. నిజం.. కవచ్ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.


More Telugu News