భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు.. లీటర్‌పై రూ.12 వరకు తగ్గింపు!

  • గరిష్ఠ రిటైల్ ధరలను తగ్గించాలని డీఎఫ్‌పీడీ సూచన
  • ఖర్చు ప్రయోజనాలను తక్షణమే వినియోగదారులకు బదిలీ చేయాలని సూచన
  • తక్షణమే ధరలు తగ్గించాలని సూచించిన కేంద్రం
వంటనూనె తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై గరిష్ఠ రిటైల్ ధరలను (MRP) తగ్గించాలని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ (DFPD) శుక్రవారం సూచించింది. గ్లోబల్ చమురు ధరలు తగ్గుదలను ఉదహరిస్తూ లీటరుకు రూ.8 నుండి రూ.12 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కోరింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) సహా ప్రధాన పరిశ్రమ సంస్థలతో జరిగిన సమావేశంలో ఖర్చు ప్రయోజనాలను తక్షణమే వినియోగదారులకు బదిలీ చేయాలని తెలిపింది.

ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో నెల రోజుల క్రితం జరిగిన సమావేశంలో... DFPD ముఖ్యమైన బ్రాండ్స్ శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్, శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్ పైన లీటరుకు రూ.5 నుండి రూ.15 తగ్గించే దిశగా సూచనలు చేసింది. ఆవనూనె, ఇతర వంట నూనెలపై కూడా తగ్గించాలని పేర్కొంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం, ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం తగ్గడం వంటి ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది.

వంట నూనె ధరలు 2021-22లలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా 2022 జూన్ నుండి ఈ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గాయి. అయితే అంతర్జాతీయ ధరలు తగ్గినంత వేగంగా దేశీయంగా ధరలు తగ్గడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. కాబట్టి తక్షణమే ధరలు తగ్గించాలని పరిశ్రమ వర్గాలకు సూచించింది. లీటర్ పై రూ.8 నుండి రూ.12కు తగ్గించాలని పేర్కొంది.


More Telugu News