130 ఏళ్లలో తొలిసారి.. కోర్టు బోను ఎక్కనున్న బ్రిటన్ రాకుమారుడు.. కారణం ఇదే!

  • ఓ వార్తా సంస్థపై దావా వేసిన ప్రిన్స్ హ్యారీ, 100 మందికి పైగా ప్రముఖులు
  • ఈ కేసు విచారణ కోసం లండన్‌ హైకోర్టుకు రానున్న హ్యారీ
  • చివరి సారిగా 1870లో కోర్టు బోను ఎక్కిన ఎడ్వర్డ్‌ VII
మేఘన్ మెర్కెల్‌ ను పెళ్లి చేసుకోవడంతో మొదలు.. రాజ కుటుంబం నుంచి బయటికి రావడం దాకా ప్రిన్స్‌ హ్యారీ విషయంలో ప్రతిదీ సంచలనమే. బ్రిటన్ రాజ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న ప్రిన్స్ హ్యారీ, మెర్కెల్‌ దంపతులు అమెరికాకు వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 3 రెండో కుమారుడైన హ్యారీ కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణకు రానుంది. దీంతో ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరై బోనులో నిలబడి హ్యారీ సాక్ష్యం చెప్పనున్నారు. గత 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన బ్రిటన్‌ రాజ కుటుంబీకుడిగా ప్రిన్స్‌ హ్యారీ నిలవనున్నారు.

బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌.. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలపై ప్రిన్స్‌ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ మేలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా లండన్‌ హైకోర్టులో హ్యారీ సాక్ష్యం చెప్పనున్నారు.  

చివరి సారిగా 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మరో 20 ఏళ్ల తర్వాత ఓ పరువునష్టం కేసు విచారణ సమయంలోనూ సాక్ష్యమిచ్చారు. ఈ రెండు కూడా ఆయన రాజు కాకముందే జరిగడం గమనార్హం. ఆ తర్వాత కోర్టు ముందుకు వస్తున్న తొలి వ్యక్తి హ్యారీనే.


More Telugu News