షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు
- జగిత్యాల క్లబ్‌లో షటిల్ ఆడేందుకు వెళ్లిన రాజ వెంకట గంగారాం
- పట్టుకోల్పోయి పడిపోవడంతో కాపాడేందుకు ప్రయత్నించిన సహచరులు
- సీపీఆర్ చేసినా స్ప్పహలోకి రాకపోవటంతో.. ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే చనిపోయినట్లు ప్రకటించిన డాక్టర్లు
షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల రాంబజార్‌కు చెందిన బూస రాజవెంకట గంగారాం అలియాస్ బూస శ్రీను (56).. రోజు మాదిరే శుక్రవారం ఉదయం జగిత్యాల క్లబ్‌లో షటిల్ ఆడేందుకు వెళ్లారు.
స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. భయపడిన స్నేహితులు, ఇతరులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. అయినా స్ప్పహలోకి రాకపోవటంతో.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. పరిశీలించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
షడిల్ ఆడుతూ గంగారాం పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అలిసిపోయిన ఆయన.. షటిల్ కోర్టు పక్కన నిలబడటం.. ఈ సమయంలో ఉన్నట్టుండి పట్టుకోల్పోయి పడిపోవడం అందులో కనిపించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి అందరినీ అప్రమత్తం చేశారు. అందరూ కలిసి ఆయన్ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వస్త్ర దుకాణం వ్యాపారి అయిన గంగారాం గతంలో స్టెంట్ వేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.