ఫస్ట్ డే ఫస్ట్ షో... దేశంలోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా రాలేదు: మంత్రి అమర్నాథ్

  • ఏపీలో కొత్త కాన్సెప్ట్
  • సినిమా విడుదల రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించే కార్యక్రమం
  • ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం
కొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రిలీజ్ రోజునే ఇంటివద్ద లైవ్ లో సినిమాను చూసేలా రూపొందించిన ఈ కార్యక్రమానికి విశాఖలోని పార్క్ హోటల్ లో శ్రీకారం చుట్టారు. మంత్రి అమర్నాథ్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమా 'నిరీక్షణ'ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదని అన్నారు. సినిమా విడుదల రోజునే కుటుంబం అంతా కలిసి ఇంటి వద్దే సినిమా చూడొచ్చని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ద్వారా గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. చిత్ర పరిశ్రమలో 80 శాతం సినిమాలు విడుదలకు నోచుకోవడంలేదని, అలాంటి సినిమాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.


More Telugu News