అక్కడ అవతరణ దినోత్సవం.. ఇక్కడ దురదృష్ట దినోత్సవం: సీపీఐ రామకృష్ణ
- రాష్ట్రాభివృద్ధికి జగన్ సమాధి కడుతున్నారన్న రామకృష్ణ
- సీఎం వందల కోట్లు కాజేస్తున్నారని ఆరోపణ
- నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి ఏం చేశారో చెప్పాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా చేసుకుంటున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్ లో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉందని, అభివృద్ధి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి అని చెప్పి వందల కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి ఏం చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం అనంతపురంలో మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి సమాధి కడుతున్నారని ఆరోపించారు. అప్పులు చేస్తున్నా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఏ రంగంలోనైనా అభివృద్ధి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా పాలన సాగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. భారత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసి.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం, నిర్వాసితులకు ఇళ్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ నుంచి పోలవరం ప్రాంతంలో పాదయాత్ర చేపడుతున్నామని వెల్లడించారు.