బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ ల వివరాలు బహిర్గతం!

  • రెజ్లర్ల నుంచి లైంగిక ప్రయోజనాలు ఆశించడం, 
    అనుచితంగా తాకడం చేశాడంటూ ఎఫ్ఐఆర్ లో నమోదు
  • నేరాలు నిరూపితం అయితే మూడేళ్ల శిక్ష పడే అవకాశం
  • రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై మొత్తం పది ఫిర్యాదులు
లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ను అరెస్ట్ చేయాలంటూ పలువురు దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలో గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోకుంటే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని కూడా హెచ్చరించారు. రెజ్లర్ల లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను ఓ ఆంగ్ల పత్రిక బయట పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ల ప్రకారం బ్రిజ్ భూషణ్ లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని, ఆయనపై10 వేధింపుల ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని తెలిపింది. మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి ఛాతీపై చేయి వేయడం, వారిని వెంబడించడం చేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. 

ఈ మేరకు రెజ్లర్లు  ఏప్రిల్ 21న ఫిర్యాదు చేస్తే, అదే నెల 28న రెండు ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 354, 354(ఎ), 354(డి), 34 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. కాగా, మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురు ఒలింపియన్ల ఆరోపణలను పేర్కొనగా, మైనర్ రెజ్లర్ తండ్రి చేసిన ఆరోపణల ఆధారంగా రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఫొటో దిగుదామనే సాకుతో బ్రిజ్ తనను గట్టిగా పట్టుకున్నాడని మైనర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆయన భుజాన్ని గట్టిగా నొక్కడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా తనను అనుచితంగా తాకాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన వెంటపడొద్దని బ్రిజ్ భూషణ్ కు స్పష్టం చేసినట్టు ఆమె తెలిపింది.


More Telugu News