రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు కంపెనీల కొత్త ఎత్తు.. చిరుద్యోగులకు పెద్ద నోటుతో వేతనాల చెల్లింపు

  • ఒకటో తేదీనే వేతనాలు చెల్లించిన కంపెనీలు
  • రెట్టింపు వేతనమిచ్చి నోట్లు మార్చి తీసుకురావాలని హుకూం
  • జూన్ 1న చేతులు మారిన కోట్లాది రూపాయలు
రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన వెలువడగానే పెద్ద నోట్లను మార్చుకోవడానికి బడాబాబులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బంగారం, స్థిరాస్తి కొనుగోలు వంటి పద్ధతులతో పాటు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలు సరికొత్త మార్గంలో రూ.2 వేల నోట్లను మార్చేసుకుంటున్నాయి. తమ సంస్థలో పనిచేసే చిరుద్యోగులకు పెద్ద నోట్లను అంటగడుతున్నాయి. వేతనాల చెల్లింపులకు రూ.2 వేల నోట్లనే ఉపయోగిస్తున్నాయి. సాధారణంగా 5, 6 తేదీలలో ఇచ్చే వేతనాన్ని ఈ నెలలో 1వ తేదీనే ఇచ్చేశాయి. మొత్తం చెల్లింపులన్నీ పెద్ద నోట్లతోనే పూర్తిచేశాయి.

కొన్ని కంపెనీలు ఇంకొక అడుగు ముందుకు వేసి చిరుద్యోగుల వేతనాలకు రెట్టింపు వేతనం చెల్లించాయి. ఇదేంటని ఉద్యోగులు ఆశ్చర్యపోయేలోపే మిగతా నోట్లను మార్చుకుని తీసుకురావాలంటూ ఆదేశించాయి. ఉదాహరణకు రూ.10 వేలు వేతనం అందుకునే ఉద్యోగికి రూ.20 వేల విలువైన 2 వేల నోట్లు చేతిలో పెట్టి మిగతా పదివేలకు చిల్లర తీసుకురమ్మని హుకూం జారీ చేశాయి. ఈ విధంగా జూన్ 1న హైదరాబాద్ లో కోట్లాది రూపాయల విలువైన రూ.2 వేల నోట్లు చేతులు మారినట్లు సమాచారం.


More Telugu News