8 గంటలపాటు కొల్లు రవీంద్ర గృహ నిర్బంధం

8 గంటలపాటు కొల్లు రవీంద్ర గృహ నిర్బంధం
  • నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో టీడీపీ సానుభూతిపరులైన మైనార్టీ యువకులపై దాడి
  • నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై రవీంద్ర ఆగ్రహం
  • పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • చివరికి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు నిన్న దాదాపు 8 గంటలపాటు గృహనిర్బంధం చేశారు. మచిలీపట్టణంలోని ఇంగ్లిష్‌పాలేనికి చెందిన టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు మైనారిటీ యువకులపై నాలుగు రోజుల క్రితం దాడి జరిగింది. ఈ కేసులో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉన్నతాధికారులను కలవాలని రవీంద్ర నిర్ణయించారు. 

విషయం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. బయటకు వచ్చిన రవీంద్రను ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. మరోవైపు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఆ తర్వాత నిందితులు ఎండీ కర్మతుల్లా, ఎండీ మొబిన్, షేక్ రోషన్‌‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండుకు తరలించారు.


More Telugu News