ఆసక్తి రేపుతున్న మహా సీఎం-శరద్ పవార్ భేటీ!

  • మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం
  • గురువారం సాయంత్రం అరగంట పాటు సమావేశమైన నేతలు
  • ఈ మీటింగ్‌పై ‘మహా’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
  • ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదన్న బీజేపీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ సమావేశం కావడం అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతేడాది అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన తరువాత తొలిసారిగా ఇప్పుడు వీరి మధ్య సమావేశం జరగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది అనేక ఊహాగానాలకూ దారి తీసింది. గురువారం సాయంత్రం అరగంట పాటు ఇరువురు నేతలు సమావేశమయ్యారు. 

అయితే, ఎన్సీపీ అధినేత మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలోని మరాఠా మందిర్ అమృత్ మహోత్సవ్ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు వెళ్లానని ఆయన ట్వీట్ చేశారు. మరాఠీ సినిమా, థియేటర్, తదితర రంగాలకు చెందిన కళాకారుల సమస్యలపై సీఎంతో ఈ సమావేశంలో చర్చించానని చెప్పారు. కాగా, మహారాష్ట్ర సీఎం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ కూడా వెల్లడించింది.


More Telugu News