​చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళితే ఏం జరుగుతుందో జగన్ కు అర్థమైంది: ఆలపాటి రాజేంద్రప్రసాద్

  • ఇటీవల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
  • నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల
  • ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆలపాటి ఫైర్
  • టీడీపీ మేనిఫెస్టోతో జగన్ లో భయం కలుగుతోందని వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టో అంటే జగన్ కు ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళితే ఏం జరుగుతుందో జగన్ కు అర్థమైందని, తనకు, తన పార్టీకి పుట్టగతులుండవన్న భయంతోనే రైతు భరోసా కార్యక్రమంలో జగన్ నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. తద్వారా ప్రజలను మరోమారు మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. 

ప్రజల్లోకి వెళ్లి చేసింది చెప్పుకొని, ధైర్యంగా పోటీ చేసే సత్తా జగన్ కు లేదు గనకే... టీడీపీ మేనిఫెస్టో చూడగానే  పిచ్చికూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. తన మాటలు, భయం ద్వారా టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని జగన్ చెప్పకనే చెబుతున్నాడు అని ఆలపాటి స్పష్టంచేశారు. 

4 ఏళ్లలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేదరికం పోగొట్టాయా? ప్రజల జీవనప్రమాణాలు పెంచాయా? అని ఆలపాటి ప్రశ్నించారు. జగన్  ఏలుబడిలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం ఎందుకు అగ్రస్థానంలో నిలిచింది? మహిళలపై అఘాయిత్యాల్లో, దళితులపై దాడుల్లో ఎందుకు ప్రపం చప్రఖ్యాతి పొందింది? యువత ఉద్యోగాల కోసం, ఉద్యోగులు జీతాల కోసం ఎందుకు చేతులు చాస్తున్నారు? అని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పాలనలో అన్ని విధాలా నష్టపోయిన అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని ఆలపాటి వెల్లడించారు. 

ఇక, ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని ఆలపాటి స్పష్టం చేశారు. తన బాబాయ్ చావు గురించి ముఖ్యమంత్రి నోరు తెరిస్తే వినాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. తన బాబాయ్ హత్య గురించి తన తల్లి, చెల్లి తనను వదిలేసి ఎందుకు వెళ్లిపోయారో జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ కూతురే జగన్ ను నమ్మలేక ఢిల్లీ చుట్టూ, కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతోందో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పాలని అన్నారు. 

రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజల హక్కులు హరించబడుతున్నాయన్న అమెరికా విదేశాంగ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? అని ఆలపాటి నిలదీశారు. ఇవేవీ ప్రజలకు తెలియవన్నట్టు జగన్ కర్నూలు సభలో సుద్దులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 

నన్ను నమ్మండి అని ప్రజల ఇంటి తలుపులపై స్టిక్కర్లు వేయిస్తున్న జగన్ కు నిజంగా దమ్ము, ధైర్యముంటే, వైనాట్ 175 అనే పచ్చబొట్లు తనపార్టీ ఎమ్మె ల్యేలు, మంత్రులకు వేయించాలని ఆలపాటి సవాల్ విసిరారు. ఆ పచ్చ బొట్లతో ప్రజల్లోకి వెళ్లి నిర్భయంగా తిరిగే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.


More Telugu News