తెలుగు రాష్ట్రాల్లో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లు... సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం

  • దేశంలో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ కోసం చర్యలు
  • విశాఖ-విజయవాడ-శంషాబాద్... విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో లైన్లు
  • ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం
దేశంలో హైస్పీడ్ రైళ్ల రంగప్రవేశానికి అనువుగా పటిష్ఠమైన ట్రాక్ లను నిర్మించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో, తెలుగు రాష్ట్రాల్లో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్రం ఆసక్తి చూపుతోంది.  విశాఖ-విజయవాడ-శంషాబాద్... విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది.  ఆరు నెలల్లోగా సర్వే పూర్తి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 

రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు ప్రవేశపెట్టేందుకు వీలుగా అవసరమైన టెక్నికల్ ఫీజబిలిటీనీ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. ఈ రెండు రైల్వే లైన్ల నిడివి మొత్తం 942 కిలోమీటర్లు. ఈ మార్గాల్లో గంటకు 220 కిమీ గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించేలా రైల్వే లైన్లు నిర్మించనున్నారు. 

ఈ రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సాకారం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొంతకాలంగా చొరవ చూపిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి పలుమార్లు లేఖలు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా సర్వేకు పచ్చజెండా ఊపింది.


More Telugu News